మా బస్ డిపో ఒక పెద్ద అల్మినీయం జబ్బ బోర్లిన్చినట్లుంది
.....జబ్బ గిబ్బ అంటవేందిరా గది నిజాం కాలంల హాన్గర్ అని ఒక సదూకోన్నాయన
చెప్పిండు. బట్టలు తగిలిస్తర్ గద్రబై....గీన ఇంకో రకంగా చెపుతుండు అనే అనుమానం పూర్తిగా తీర లేదు.
ఇగ అస్సల్ కథ .....గా బస్ డీప్ నుంచి కొంచం ముందుకొచ్చి, పీచే మత్ జాన హవ్వ అఫ్జల్
గంజ్‌ల తేలుతర్, సందుల పొంటి అవి జెప్పినట్లే తిరిగితే ఇంకా చిన్న సందులు
అంటే ముత్తేకంత గల్లీలోస్తయి.. దాంట్ల నఖాశి
గల్లీలు.....ప్రాజెక్ట్ A సీన్మాల మన జాకి చాన్ చెంగడ బింగడ ఎగిరి ఒక ఇరుకు సందుల
రెండు కాళ్ళు బార చాపి నిలబడతడు సూడు గంత కన్నా బారీగ్గా ఉంటయి.
జాకి చాన్ అవసరం లేదు మా గల్లీ పొరలు అటు గోడ ఇటు గోడ
పట్టుకొని 007 ఫీట్లు జేసే టోల్లు. ఇగ గా నఖాశి గల్లీలు పట్టుకొని కుడి
ఎడమ కుడి ఎడమ మొహమాటం లేకుండా పొతే ఒక చారిత్రాత్మక నిజాం కాలం నాటి (మల్లా) ఒక
బంగ్లా....దాని మెయిన్ దర్వాజ ఎక్కడుందో పకడ్న ముశ్ఖిల్ హీ నహిన్ నా
ముమ్కీన్....ఇంతకూ మా నఖాశి గల్లీలు తిరిగినప్పుడల్లా ఒకటి అనిపించేది.....అరే
మాయల ఫకీర్, బాల నాగమ్మ నెత్తుకపోయి ఒక ఫాల్తు గానిలాగ పానాలు చిలకల
బెట్టుడేన్దిరా.....నీ పానాలు మా నఖాశి గల్లీల ఎక్కడ దాపెట్టినా బాల వర్ధి కాదు
బాల కిషన్ గూడ జీవితాంతం లెంకినా దొరకక పోతుండె! అఫ్సోస్....అబ్ మాయల ఫకీర్ కొ
చోడో....బంగ్ల గురించి మొదలు పెట్టిన కదా.....గా బంగ్ల ల జనాలు , ఎదో సీన్మాల సూపెట్టినట్లు
ఎల్తనే ఉంటరు. అస్సల్ గిసొంటి బంగ్లలల్ల జనాలను సూశే సంజయ్ గాంధీ అర్జంట్‌గా
ఫ్యామిలీ ప్లాన్నింగ్ షురూ జేశిండంటరు బుజుర్గ్ .
అప్పటికి హైద్రాబాద్ దూర్ దర్షన్ వొచ్చి ఎక్కువ సంవత్సారాలు
గాలే....డయనోర, ECTV లు గక్కడోక్కటి , గిక్కడోక్కటి! గంత పెద్ద
బంగ్ల ల ఒక మార్వాడి నట్వర్లాల్ పోర్షన్ల ఒకటి, ఇంకోటి ఒక మామిల పోర్షన్ల! నట్వర్లాల్ దిమాక్ ఊకనే
సర్కాయిస్తుండే. ఇగ మిగిలింది మామీల TV.
ఆ రోజులల్ల ఆదివారం వొచ్చే తెలుగు సినిమాకు అన్నదానం దగ్గర
అంగలార్చే జనాల్లాగా బిల్డింగ్ జనాలంతా ఒక్కటే ప్రిపరేషన్.....ఆదివారం
ఎప్పుడోస్తది, ఎప్పుడోస్తది అని కలవరింతలు. నల్ల దగ్గర, బాసండ్లు తోమే దగ్గర ఇంక
ఎక్కడ పడితే అక్కడ ఒకర్ని చూసి ఒకరు ముసి ముసి నవ్వులు....అదే వొచ్చే ఆదివారానికి రడీయా
అన్నట్లు! క్యా తోబి పిచ్చర్ దిలో అవుర్ దిమాక్ పే పూరి చాయి హుయి.....ఇంత
ప్రిపరేషన్ ఒక యుద్ధానికి కూడా చేసుండరేమో అనిపించేది.
ఆదివారం రాంగనే ఒక్కటే పెళ్లి సందడి....కొందరైతే పొద్దునే లేచి
తయారైపోయిండ్రు....అఫ్కోర్సు సీన్మ సాయంత్రం అనుకోండి. పిల్లా , జెల్లా , ముసలి, ముతక, యువతి , యువకలు, బాలింతలు, చూలింతలు(అమ్మ తోడు)
సాగర్ టాకీస్ల కిక్కిరిస్నట్లు ఆ రెండు కమ్రల మామి పోర్షన్ల
గొప్ప ఆంటిసిపెషన్తో TVకి కళ్ళని
అతికేసిండ్రు.....అప్పుడు సడన్‌గా హాహాకారాలు......'అయ్యో మామి దీని డైరెక్టర్
రామ కృష్ణ .....అయ్యో'...అట్లా మామి అయ్యో ఇంకో మామి జవాబు. మళ్ళీ
అయ్యో మామి ఈ సినిమాల ఒక్క నాగేశ్వరరావు తప్ప అందరు చచ్చి పోయారు .....అయ్యో మామి
సినిమాలోనా, నిజంగానా? అక్కడి పోరలకు మామీల
అంతెందుకు బాధ పడుతున్రో గింత గూడ అర్ధం కాలే.....కాని అప్పటికి పేర్లు మాత్రమే
పడ్డయి.....సినిమా అంతా ముందుంది!
ఇంతకీ షార్ట్ కట్ల మాకందరికీ ఒక్కటి తెలుసు....మామి అంటే
మద్రాస్ల 'ఆంటీ'....దీంట్లో ఒక మామి అచ్చమైన మద్రాస్ నుండి, ఇంకో మామి చిత్తూర్ నుండి
దిగుమతి. ఈ ఇద్దరు మామీలు, వాళ్ళ కుటుంబాలతో సహా అనుకోండి, తిరిగి తిరిగి మా
హైదరాబాద్‌ల, మా బంగ్లల అదీ పక్క పక్క పోర్షన్ల ఎట్ల జేరిండ్రో మురుగా , మురుగా! ఇద్దరి మామీల మద్య
ఏమేం మనసులు కలిసినయో కనీ మాకు మాత్రం 'అయ్యో మామి అంటే 'అయ్యో మామి' అనే బందమే జోర్గ విన
పడ్డది.
ఇగ మామీలను దాటుకొని 'విప్ర నారాయణ' మొదలైయ్యింది....చూసేటోల్లు
చాల వరకు సినిమా మీద ఎంత ఫోకస్ ఉన్నా మళ్ళా ఏం ఇనాల్సి వస్తదో అని కొంచెం గుటుక్కు
మెటుక్కు. ఇంతల గా నాగేశ్వరావు పాట అందుకున్నడు....మేలుకో శ్రీ రంగ....అరే ఘంటసాల
గొంతేంది ఇంత సన్నగుంది, లే లే ఇది ఎ ఎం రాజది అని చిత్తూర్ మామి పెద్ద బిడ్డ సంగీత
పిపాస ఒక్కటే బైస్ పెట్టింది. అరే ఎవలో ఒకలు ఇంటే గాదా....అని మా బంగ్ల 'పెద్ద' అవుర్ పెద్ద దిక్కు అన్నమ్మ
గదిరించింది. గీ ముసలామె కతేంది , సూసేది మా ఇంట్ల మల్లా రుబాబ్
అన్నట్లు సూసింది సంగీత పిపాస, కాని అనే దైర్నం చేయలే.
విప్ర నారాయణడు ఇంకొంచం బెరుకు బెరుకుగా నడిచిండో లేదో
అయ్యో మామి....చిత్తూర్....ఇంకో అయ్యో ఎందుకు వేస్ట్ అన్నట్లు మద్రాస్ మామి
చిత్తూర్ వైపు జూసింది. అయ్యో ఈ నాగేశ్వరావు ఆ భానుమతిని చూడకుండా ఎంత పని చేసాడు
మామి, ఇప్పుడామే కక్ష కడుతుంది......అగ్గో మొదలే
సూస్తే ఇంగ సీన్మ ఏముంది , మీరు మరీ సుతారం జేస్తరు అని గయ్యి మని లేచింది మా పటాన్
చేరు ఝాన్సి భాయక్క. చెప్పడం మరిశిన మా ఝాన్సి భాయక్క మా బంగ్లోల్ల
కోడలు....ఎవ్వరినైన, ఎప్పుడైనా తిట్టొచ్చు!
పొరల గుంపుల మాక్సిమం టెన్త్ ఫేల్ద్ వరకు రానిస్తరు అదో క్వాలిఫికేషన్ లాగ....అంత
కంటే పెద్దోల్లు గుసాయించేది కుద్రదన్నమాట. ఇగ పేర్లు సూడలే ....లల్లి, పప్పీ, బుజ్జి, బజ్జీ(మా కసం), నచ్చి, ముర్రి, నల్ల కొమార, తెల్ల కొమార, దన్ను, దనం, ఎంకు, సన్న(లావోక్కటి మిస్
అయ్యింది). అస్సల్ పేర్లు తల్లిదండ్రులకు కూడా జల్దిన యాది రావు.
ఇంతల పప్పీ గాడు సీకట్ల లేసి అన్నమ్మకు అడ్డం
వొచ్చిండు....వాడు మనుమడు అని కూడా సూడకుండా మా అన్నమ్మ ఒక శ్లోకం
సదివేసింది....ఎక్కడ పోవాల్ర బడ్వే అని గుర్రాయించింది. పప్పిగాడు సీకట్ల
సిటికనేలు సూపించిండు. పోద్దటిసంది అమాన్ఖాన పోలే బడ్వే , ఇప్పుడే వొచ్చిందా.....సరే
పో. పప్పిగాడు రెండో రూమ్ దాటక ముందే సడన్‌గా ఆగిపోయ్యిండు......కొంచం దూరం నుండి
డాప్లర్ ఎఫెక్ట్ లాగ కిర్రు, కసక్, కిర్రు , కసక్ అనే చెక్క మెటల్
కలిసిన సౌండ్లు ఇనపడ్డయ్.....ఆ సౌండ్ అర్ధం అందరికి తెల్సు.....మామీలనుండి అందరు
పిన్ డ్రాప్ సైలన్స్.
విప్ర నారాయణ కు కొంచం ఫ్రీడమ్ దొరికి జల్దిన
ఆశ్రమానికొచ్చిండు. ఇంతకీ ఆ సౌండ్లు గొల్లెంకట్ జూతాలవి....గాడు ఎదో చిన్న పోలీస్
కేస్ల జేల్కు పోయి, విడుదలై వొచ్చి షూస్ కి చెక్కల్, మొలలు కొట్టించుకొని కిర్రు, కసక్, కిర్రు , కసక్ అని అందర్నీ పైదల్
పైదల్ జేస్తుండే. పప్పి గాడు అంత అర్జెంట్ల గూడ ఆగిండంటే అర్ధం జేసుకొండ్రి.
గొల్లెంకట్ అంటే సీనా తానె పెహెల్వానోకోభి హడల్ ఆ టైమ్‌ల.
సీన్మాల నాగేశ్వరావు ఎంటనే భానుమతి వచ్చింది.....సంగీత
పిపాస ఉత్సాహం ఎక్కువై పక్కనున్న చెల్లె వీపు పై ఒక్కటి చరిచింది....లక్ష్మీ(పిపాస
అస్సలు పేరు) నీకు నేనందంగా ఉంటానని ఎంత జెలసే అని ప్రైవేట్ మాటేర్స్ మాట్లాడేసింది.
జెలసా నా బొందా పాటోస్తుంది జూడు....ఇంకా రాలే ....అదేనే వొస్తుంది 'ఎందుకోయి తోటమాలి' అని భానుమతికన్నా
ముందందుకుంది. క్యా గారి బాప్ మగర్ జరా గలా మర్దోవాలి....అని టెన్త్ ఫెయిల్ బాట్చ్ ఒకటి గుస
గుస మన్నది. ఎక్స్పర్ట్ కామెంటరీ విన్నా సంగీత పిపాస పాట ఆపలేదు.
ఇంతల 'మ్యూజిక్ ఇన్ దిస్ పిక్చర్
ఇస్ గుడ్' అనే మాటలు వినబడి పోరలంతా పక్కల బాంబు పడ్డట్లు బోరాన్
బోరాన్ అయ్యిండ్రు....అంగ్రేజీ ఎఫెక్ట్....కౌన్‌రే బావ యహాన్ అంగ్రేజీ అని సూస్తే
చిత్తూరు మామి శోహర్ రామయ్య సీకట్ల కట్టుడు పల్లతోనే తెల్లగా నవ్వుతున్నడు. రామయ్య
చరిత్ర చాల ఉంది.....పూరా గౌలిగూడ చరిత్రలో ప్రింటింగ్ ప్రెస్ అవుర్ మిర్చి బజ్జీల
దుక్నం పెట్టిన పెహ్లే ఆర్ ఆఖ్రీ ఆద్మీ! మద్య మద్యల అంగ్రేజ్ ఇడిసి పిల్లల్ని
సీన్మ సూడనియ్యకుండా జేస్తడు...గదేం సంతోషమో! మా నాన్న ఇంగ్లిష్‌కి బాగా
చదువుకున్నోళ్ళు కూడా బాగా ఇంప్రెస్స్ అయితరు అని సంగీత పిపాస అప్పుడప్పుడు ఏం
వార్నింగ్ లేకుండా జేపుతుండే....ఎంతవరకు చదువుకున్నోల్లె అని ఆమె గాంగే
నసుగుతుండే.
విప్ర నారాయణ రొమాన్సు కొచ్చిండు....దేవ దేవి, దేవ దేవి అని శిగమొచ్చినట్లు
మాట్లాడుతుండు....గీనికేం పోయే కాలం గిట్ల మారిపోయిండు అని షోలాపూర్ శాంతమ్మ
ముక్కు చీదింది. ఆమెకు సర్కాయిస్తే మరాటీల తిట్లేత్తుకుంటది....తుజ ముండ
పడోరే...వగైరా, వగైరా. ఇక్కడ నాగేశ్వరావు దేవ దేవి, దేవ దేవి అంటనే ఉన్నడు
పైనుండి 'రాధ' అని వినిపించిది.
ఆ గొంతు సూరనారయన గారిది....కృష్ణుడు గూడ అంత ప్రేమతో అస్సలు రాధను పిలిచుండడు! మల్లా 'రాధ'....ఎంత మార్దవం, ములాయం, మోహబ్బత్, మార్దవ రావు అనే పేరు
పెట్టుండాలే! ఏమండి వొస్తున్న….. రాధమ్మ గారి గొంతు....వాళ్ళ
పోర్షన్ రెండు రూమ్‌లే మరి ఎంత దూరం నుండి వొస్తుండ్రో రాధమ్మ గారు. అస్సల్ ముచ్చట
చెప్పలే గీల్లు కొత్త శాది జంట గాదు, పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు
జేసిన విశ్రాంత పేర్.
మొత్తానికి ఇప్పుడు విప్ర నారాయణ ట్రాజేడీల
ఉన్నడు....గుల్లే ఎదో గిన్నేత్తుక పోయిండని రాజు జేల్ల ఏస్తడు. అయ్యో మామి
ఇప్పుడేం జరుగుతుందో తెలుసా, తెలుసా అని చిత్తూర్ మామి
యధావిధిగా ఆరాట పడ్డది.
రెండు కాన్ బైరిలు కొట్టాలె అన్నడు అప్పటిదాకా ఓపిక పట్టిన
తెల్ల కొమార టెన్త్ ఫేల్ద్! అదే మామి, గా రాజుగాన్ని కాన్ బైరిలు అని కవరింగ్
ఇచ్చుకొన్నడు. పోరలంతా గర్వంగా తెల్ల కొమార దిక్కు సీకట్లనే జూసిండ్రు. ఆ సీకటి సూపుల్లో
'క్యా బోలె బాప్' అన్న భావం సైలెంట్‌గా
ఇనిపించింది.
తెలుగు సీన్మ్లల ట్రాజేడీలగూడ ఎన్నో పాటలుంటయి గదా భానుమతి 'అనురాగాలు దూరములాయెనా....
మొదలు పెట్టంగనే చిత్తూర్ మామి అందుకొని భానుమతి పోర్షన్ ఎ ఏం రాజ పోర్షన్ మొత్తం
పాడేసింది. చిత్రంగా పొరలు, పెద్దలు అందరు శ్రద్దగ విన్నరు....నిజానికి చాల బాగా
పాడింది మా మామి ఎంత బాగా అంటే యూ ట్యూబ్‌ల ఆ పాటను చూసినా మామి గొంతు యాదోచ్చేటoత!
అయ్యో మామిమిమిమిమిమిమిమి....సంగీత్ టాకీస్ సౌండు లెవెల్లో ....శుభం
కార్డు పడ్డది...ఈ సారి పొరల గుంపు నుండి వినపడ్డది!